అంగన్వాడీ సిబ్బందికి ‘తల్లికి వందనం’
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

అమరావతి, జూలై17(క్విక్ టుడే న్యూస్):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వాగతించారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి చిరకాల డిమాండ్‌ను నెరవేర్చిందని ఆమె పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది అందరికీ ఈ పథకం అమలు కానుందని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి భరోసా కల్పించే మరో కీలక నిర్ణయం ఇదేనని మంత్రి అన్నారు. ఇప్పటికే జీతాల పెంపు, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా వర్తింపజేయడం ద్వారా వారి సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు మంత్రి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందిలో ఆనందం నెలకొందని పేర్కొన్నారు. కాగా, తమను కూడా ‘తల్లికి వందనం’ పథకం పరిధిలోకి తీసుకురావాలని అంగన్వాడీ సిబ్బంది గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
